కలం డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన సర్ (SIR – Special Intensive Revision)పై అనేక రాష్ట్రాల్లో, రాజకీయ పార్టీల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, బీజేపీ, దానికి మద్దతు పలుకుతున్న పార్టీలు ఈ విధానాన్ని సమర్ధిస్తున్నాయి. కాంగ్రెస్ సహా పలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వివాదంపై ఒకేసారి అటు సుప్రీంకోర్టులో, ఇటు పార్లమెంటులో లోతుగా వాదనలు, చర్చలు జరుగుతున్నాయి.
‘సర్ (SIR)’పై విధాన నిర్ణయం తీసుకునే లీగల్ హక్కు ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి వ్యాఖ్యానించారు. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదని, ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లు గల్లంతయ్యాయని వివరించారు. ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం సన్నగిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పది గంటల పాటు చర్చ జరిగేలా లోక్‌సభలో షెడ్యూలు ఖరారైంది. రాహుల్‌గాంధీ సైతం డిబేట్‌లో పాల్గొననున్నారు.
ఓటు వేసే హక్కు మాత్రమే కాదు…
మరోవైపు సుప్రీంకోర్టులో సైతం వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఓటు హక్కు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉండాలని, ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తి ఇదేనని సీనియర్ అడ్వొకేట్ షాడన్ ఫరాసత్ అన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉన్నప్పుడు పౌరులందరికీ ఓటర్ల జాబితాలో పేరు ఉండే హక్కు కూడా ఉండాలన్నారు.
‘SIR’ ప్రక్రియలో భాగంగా పౌరసత్వం ఉన్నవారే ఓటర్లుగా అర్హులంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్తున్నదని, కానీ ఓటర్ల జాబితాను రూపొందించే సమయంలో ఆ పౌరసత్వాన్ని నిర్ధారించుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణ లేదా ఓటర్ల జాబితాపై అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందన్నారు. పార్లమెంటు సకాలంలో స్పందించకపోతే రాష్ట్రాల అసెంబ్లీలకు ఆ అధికారం ఉంటుందన్నారు.
సమాచార హక్కు చట్టం లాగానే ఉంది : జస్టిస్ బాగ్చి
ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కు… కానీ అది ఓటర్ల జాబితాలో వారి పేర్లు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతున్నది.. సమాచార హక్కు చట్టం సైతం సామాన్యులకు సమాచారం తెలుసుకునే హక్కు ఉండాలని చెప్తున్నది.. కానీ ఆ చట్టం స్ఫూర్తి మేరకే సమాచారం తెలుసుకునే హక్కు ఉండాలన్న కారణంతో సామాన్యులకు చేదు అనుభవం ఎదురవుతున్నది.. ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం కూడా అలాగే ఉన్నది… అని జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి వ్యాఖ్యానించారు. ‘సర్’ విషయంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల అర్హతను నిర్ధారించడంలో రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఒక వ్యక్తి దేశ పౌరుడు కాదనో, లేక విదేశీయులు అనో ఎన్నికల సంఘం నిర్ధారించలేదన్నారు. ఈ రెండూ సిటిజెన్‌షిప్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ పరిధిలోని అంశాలని అన్నారు.
Read Also: భారత బియ్యంపైనా టారిఫ్స్!
Follow Us On: X(Twitter)


