కలం, నిర్మల్: జిల్లాలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. ఆదివారం భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో SIR ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో SIR ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రతి ఓటరుకు SIR ఫారములు అందించామని అన్నారు.
SIR ఫారముల ప్రక్రియ స్వీకరణ కూడా కొనసాగుతుందని వివరించారు. తిరిగి తీసుకున్న ఫారముల డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 42 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లాలోని 23 మండలాల్లో 7 లక్షల 55 వేల ఓటర్లకు SIR ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉందని, బైంసా పట్టణానికి సంబంధించి నిన్నటి సాయంత్రం వరకు 20 శాతం ఎన్యూమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ పూర్తిచేసినట్లు చెప్పారు.
పట్టణ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, బీఎల్ఓ, బీఎల్ఓ సూపర్వైజర్ల ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహశీల్దార్ శశిభూషణ్, ఎంపీడీవో నీరజ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓ లు ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

