కలం, నిజామాబాద్ బ్యూరో : మేకలు గొర్రెలకు అపాయంగా మారిందని ఓ పెద్ద పులికి విషమిచ్చిన గొర్రెను ఎరగా వేశారు. ఆపై ఆ గొర్రెను తిన్న పులి మృత్యువాత పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలోని భీమ్ గల్ (Bheemgal) మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, అటవీ అధికారులు కలిసి ఓ గొర్రెల కాపరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తాళ్లపల్లి ప్రాంతానికి చెందిన ఓ గొర్రెల కాపరి నెల రోజుల కిందట మేకలు, గొర్రెలతో అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఓ గొర్రెను పెద్ద పులి చంపేసింది. దీంతో అటవీ ప్రాంతానికి వెళ్లాలంటే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది.
గొర్రెలు పులికి ఆహారంగా మారుతుండటంతో పులి అడ్డు తొలగించాలని అతను భావించాడు. ఒక గొర్రెకు విషం ఇచ్చి.. పెద్ద పులికి ఎరగా వేశాడు. దాన్ని తిన్న పులి మృత్యువాత పడగా.. కళేబరాన్ని ఎవరికీ తెలియకుండా అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టాడు. ఈ విషయం తెలిసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పూడ్చిపెట్టిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ తవ్వి చూడగా పెద్ద పులి అవశేషాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకొని కాపరిని విచారిస్తున్నారు.

