కలం, నకిరేకల్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్‌లో నకిరేకల్ మున్సిపాలిటీతోపాటు మండలానికి చెందిన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఈ నెల 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్‌లో పర్యటించనున్నారని, ఈ సందర్భంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారని వెల్లడించారు.
ముఖ్యంగా రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. అదేరోజు నూతనంగా రూపుదిద్దుకున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వీటితో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల నూతన భవనాలకు భూమిపూజ చేస్తారని వివరించారు.
నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఏ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ దుకాణం నుంచైనా బియ్యం పొందే వీలుంటుందన్నారు. దేశంలోనే ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వేముల వీరేశం కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

