కలం, వెబ్ డెస్క్: అమెరికాతో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరబోతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) స్పష్టం చేశారు. ‘భారత ప్రతిపాదనలకు వాషింగ్టన్ ఆమోదం తెలిపిన తరువాత.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుందని వివరించారు. టారిఫ్ రేట్ల గురించే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఇవి తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఒప్పంద ప్రకటన ఉండబోతుంది’ అని వెల్లడించారు. భారత్ ఎగుమతి చేసే వస్తువులకు అమెరికా సహా ప్రపంచ మార్కెట్లో మరింత పోటీ, ప్రాధాన్యం కలిగించడమే ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా ఉండబోతుందన్నారు. వస్తువులకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మరింత మెరుగైన రేట్లు అందించేలా కొన్ని నెలలుగా చర్చలు చేస్తున్నట్లు వివరించారు. వీటిపైనే అమెరికా పేచీ పెడుతోందని వాణిజ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
టారిఫ్స్ రేట్లపైనే..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్ సహా అనేక దేశాలపై సుంకాలతో రెచ్చిపోయారు. ఒకానొక దశలో ఇవి వంద శాతానికి కూడా చేరువై.. సుంకాల యుద్ధమే జరిగింది. అంతేగాకుండా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కూడా మరికొంత అదనపు సుంకాలు కూడా విధించారు. చర్చల తరువాత సుంకాలు 25 శాతానికి, కొన్ని వస్తువులపై 18 శాతంగా అమలవుతున్నాయి. ఇంతవరకు అమెరికా, భారత్ మధ్య సుంకాల విధింపుపై సరైన ఒప్పందం అంటూ లేదు. త్వరలోనే దాన్ని కుదుర్చుకోబోతున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఏయే వస్తులపై ఎంతెంత టారిఫ్స్ విధించారో స్పష్టమవుతుంది.

