కలం, స్పోర్ట్స్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy) క్వార్టర్ఫైనల్లో ఒక ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో మణిపూర్ పేసర్ బిశ్వోర్జిత్ కొంథౌజమ్ (Bishwojit Konthoujam) యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. బిశ్వోర్జిత్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సూర్యవంశీ, తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. ఈ ఒక్క వికెట్ వెనుక బిశ్వోర్జిత్ ఏళ్ల శ్రమ దాగి ఉంది. ఆయన మొదట క్రికెటర్ కాదు, ఒక బాక్సర్. పాఠశాల, రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు కూడా సాధించాడు. అయితే గల్లీల్లో సరదాగా క్రికెట్ ఆడటం ఆయనకు అలవాటు. ఒకసారి స్థానిక క్రికెట్ సంఘం కార్యదర్శి రోనెల్ సింగ్ బిశ్వోర్జిత్ బౌలింగ్ వేగం చూసి, క్రికెట్లోకి రమ్మని సలహా ఇచ్చాడు.
బాక్సింగ్‌ను వదిలి క్రికెట్ పట్టడం బిశ్వోర్జిత్కు సులువు కాలేదు. కానీ బాక్సింగ్ ఇచ్చిన క్రమశిక్షణ, పట్టుదల ఆయనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కఠిన సాధనతో 2018లో మణిపూర్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి రంజీ సీజన్లోనే 30 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మణిపూర్‌లో సరైన వసతులు లేకున్నా, కొండ వాలు ప్రాంతాల్లో పరుగెడుతూ బిశ్వోర్జిత్ ఫిట్నెస్ సాధించాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100కు పైగా వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌లోని కౌంటీ క్లబ్‌కు ఎంపికైన మొదటి మణిపూర్ ఆటగాడు కూడా ఆయనే. మ్యాచ్ ముగిసిన తర్వాత బిశ్వోర్జిత్ యువ ఆటగాడు సూర్యవంశీని కలిసి అభినందించాడు.

