కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం మూడవ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ధర్నా (BRS Protest), రాస్తారోకో కార్యక్రమం ఉధృతంగా సాగింది. భారత రిజిస్ట్రేషన్ చట్టం 22A సెక్షన్ కింద జిల్లాలోని రేకుర్తి, సీతారాంపూర్, కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాలకు చెందిన సుమారు 6,000 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భూ బాధితులు, రైతులతో కలిసి రేకుర్తి చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హాజరయ్యారు. ముందుగా రేకుర్తి కూడలిలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేలాదిమంది బాధితులు, రైతులు, ప్రజలతో కలిసి రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడటమే బీఆర్ఎస్ పార్టీ నైజమని స్పష్టం చేశారు. 1908లో రూపొందించిన భారత రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A వల్ల గత 115 ఏళ్లుగా లేని ఇబ్బందులు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎదురవుతున్నాయని మండిపడ్డారు. కేవలం దోచుకోవాలనే దురుద్దేశంతోనే పేదల పట్టా భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.

