Mobile Popup Ad
Mobile Popup Ad

వనపర్తిలో ధాన్యం అవకతవకలపై నిరంజన్ రెడ్డి ఫైర్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : వరి ధాన్యం కొనుగోళ్లలో అర్హతలేని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఆరోపించారు. ఆదివారం వనపర్తిలోని (Wanaparthy) తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నెలల తరబడి ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కుప్పలను పరిశీలించి.. రైతులు అష్టకష్టాలు పడి పండించిన ధాన్యం నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాల కారణంగా పెద్దఎత్తున ధాన్యం తడిసిపోయిందని, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతులు వివిధ ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్నలను సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు రోజులు తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి మొత్తం ధాన్యం కొనుగోలు చేశామని ప్రకటించడం బాధ్యతారాహిత్యమని అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఈ పరిస్థితి నెలకొనింది అని అన్నారు.

రాష్ట్రంలో లక్షల హెక్టార్లలో ధాన్యం సాగు జరిగినప్పటికీ, సరిపడా లారీలు లేకున్నా కొన్ని ఏజెన్సీలకు ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ట్రాన్స్‌పోర్ట్ టెండర్లలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. సివిల్ సప్లైస్ అధికారి స్టీఫెన్ రవీందర్ అర్హతలేని ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే ఏజెన్సీకి పలుచోట్ల అవకాశాలు కల్పించారని, కేసులు ఉన్న మిల్లర్లకే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టులు ఇవ్వడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఒక మిల్లర్ మంత్రి కుమారుడికి రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చాడనే ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 57 మిల్లులపై పంచనామాలు చేసినప్పటికీ, కేవలం 34 మిల్లులపైనే చర్యలు తీసుకున్నారని, మిగతా మిల్లులు అధికార పార్టీ నేతలకు చెందినవేనని ఆరోపించారు.

శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండేళ్లు గడిచినా నిందితులను అరెస్ట్ చేయకపోవడం ముఖ్యమంత్రి వైఫల్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. వెంటనే హంతకులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, పలుస రమేష్ గౌడ్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ కర్రెస్వామి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>