కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి (Singareni) సంస్థ మొదటిసారి టార్గెట్‌ను చేరుకోలేక పోయింది. 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని 58 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే మొదటి సారి అని కార్మికులు చెప్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో సింగరేణి సంస్థ లక్ష్యాన్ని మించి ఉత్పత్తిని సాధించింది. 2015- 16 ఆర్ధిక సంవత్సరంలో 56 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 60 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. అంటే 108 శాతం ప్రగతిని సాధించి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అలాగే 2018-19లో 62 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని 64 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఇక 2024-25 సంవత్సరానికి గాను 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో 69.01 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీసింది. అంటే లక్ష్యాన్ని దాదాపుగా చేరుకోగలిగింది.
2025-26 సంవత్సరంలో మొదట 76 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాగా, గడిచిన సంవత్సరం ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకొని 70 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఆ లక్ష్యాన్ని కూడా చేరుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో 60 మిలియన్ టన్నుల లక్ష్యానికి సింగరేణి (Singareni) సంస్థ తగ్గించింది. కానీ, నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువగా కేవలం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీయగలిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సంవత్సరం అంటే 2026-27 సంవత్సరానికి అసలు లాభాలు వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో సింగరేణి యాజమాన్యం కొట్టుమిట్టాడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో సింగరేణి యాజమాన్యం సమావేశమై లక్ష్యాన్ని నిర్దేశించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సింగరేణి సంస్థ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు, కార్మికుల గైర్హాజరు, అంతర్గత నిర్వహణ లోపాలు వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఇవే ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: రేపే ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ప్రారంభం : మంత్రి పొంగులేటి
Follow Us On: Instagram

