కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (Integrated Bhu Bharati Portlal)ను తయారు చేశామని చెప్పారు. ఈ పోర్టల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి భూ వివాదాల పరిష్కారానికి తొలి అడుగు వేయబోతున్నామని ప్రకటించారు. ఈ ఫలితాలను ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి భవిష్యత్తులో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ (Integrated Bhu Bharati Portlal)ను రైతు కోణంలో రూపొందించామని సామాన్య ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2నుంచి ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పొంగులేటి సూచించారు.
గతంలో మాదిరిగా భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి అవసరం లేకుండా ఇంటి నుంచే భూ సేవలు పొందేవిధంగా పోర్టల్‌ను రూపొందించామని వెల్లడించారు. భూభారతి చట్టం ఆధారంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ (ఎల్‌పిఎమ్) యూనిక్ నెంబరు, అదేవిధంగా ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ నెంబర్‌ను కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ సమస్యలు రైతు జీవితంలో పెద్ద అడ్డంకిగా మారాయని వాటికి శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతు ఇంటి నుంచే అన్నిసేవలు పొందేలా పారదర్శక వ్యవస్ధను తీసుకువస్తున్నామని.. రెవెన్యూ వ్యవస్ధలో చారిత్రాత్మక మార్పునకు ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ నాంది అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

