సింగరేణి ఉద్యోగులకు ఎస్‌బీఐతో కొత్త బీమా ఒప్పందం

కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి కార్మికులకు (Singareni Employees) గుడ్ న్యూస్. ఎస్‌బీఐ (SBI) తో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌బీఐలో శాలరీ అకౌంట్ కలిగిన సింగరేణి ఉద్యోగులకు సహజ మరణానికి కూడా గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షల బీమా సదుపాయం అందించనున్నారు. ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే రూ.కోటి బీమా అమలులో ఉండగా, తాజాగా సహజ మరణాలను కూడా ఈ పథకంలో చేర్చారు. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు, ఫైనాన్స్ డైరెక్టర్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో ఈ ఒప్పందం అమలులోకి వచ్చింది.

సింగరేణి డైరెక్టర్ల సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్, ఎస్‌బీఐ తరఫున డీజీఎం సి.ఎస్.పి నీలాక్షి సింగ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ.. సంస్థలోని 40 వేల మందిలో ఎక్కువ మంది ఎస్‌బీఐలో ఖాతాలు కలిగి ఉన్నారని తెలిపారు. కార్మికుల భద్రత కోసం ఇటువంటి బీమా పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు. డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 2021-22 నుండి ఎస్‌బీఐ ప్రమాద బీమా పథకం అమలు చేస్తోందని, ఇప్పటివరకు 50 మంది ఉద్యోగులకు రూ.30 కోట్ల బీమా చెల్లించిందని వివరించారు.

ఎస్‌బీఐ డీజీఎం సి.ఎస్.పి నీలాక్షి సింగ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తన ఆర్థిక లావాదేవీలను తమ బ్యాంకు ద్వారానే నిర్వహిస్తూ వస్తుందని, ఎక్కువ మంది ఉద్యోగులు తమ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్నారని మారుమూల ప్రాంతాల్లో కూడా కార్మికుల (Singareni Employees) సౌకర్యం కోసం బ్యాంకులను, ఏటీఎంలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే కార్పోరేట్ శాల‌రీ ఖాతా క‌లిగిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యులు రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే కుటుంబంలో భార్యాభ‌ర్త‌ల‌తోపాటు ఇద్ద‌రు పిల్ల‌ల‌కు 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని కూడా ఎస్‌బీఐ అందిస్తోంద‌ని వెల్ల‌డించారు. రిటైర్డ్ కార్మికులకు కూడా 30 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని 70 సంవత్సరాల వరకు అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే మృతుని కుటుంబంలోని పిల్లలు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నవారు చదువుతూ ఉన్నట్లయితే వారికి అబ్బాయి అయితే ఎనిమిది లక్షలు, అమ్మాయి అయితే 10 లక్షల రూపాయలను చదువు కొనసాగించడానికి ఉచితంగా చెల్లించనున్నామని, ఒకవేళ వివాహ వయస్సు కలిగిన పిల్లలు ఉన్నట్లయితే ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున గరిష్టంగా ఇద్దరికి కలిపి 10 లక్షల రూపాయల వరకు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే 5 లక్షల రూపాయలు చెల్లిస్తామని అలాగే తమ బ్యాంకుతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉందని ఇంకా అనేక సౌకర్యాలు ఈ ఒప్పందంలో పొందుపరిచామని ఆమె వివరించారు.

Read Also: తొందరపడొద్దు.. ఆర్టీసీ కార్మికులకు శ్రీధర్ బాబు విజ్ఞప్తి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>