కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి: కొండా సురేఖ డిమాండ్

కలం, యాదగిరిగుట్ట : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసనను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వల్ల తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని ప్రకటించారు. పేపర్ లీకేజీలను నిరసిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.

న్యాయం చేయాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై లాఠీలతో దాడి చేయడం అత్యంత అమానుషమని మంత్రి మండిపడ్డారు. అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విచక్షణ రహితంగా ఈడ్చుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యాదగిరిగుట్టలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ వాణి భారత్ గౌడ్, కౌన్సిల్లర్లు, మండలం పార్టీ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు ముక్కెర్ల మల్లేష్ యాదవ్ సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>