కలం, వెబ్ డెస్క్: భారీ వరదలతో అస్సాం (Assam Floods) రాష్ట్రం వణికిపోతుంది. గత ఆరు దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని అత్యంత తీవ్రమైన వరదలతో తూర్పు అసోం ప్రాంతం నీట మునిగింది. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వరదనీరు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గ్రామాలు, పట్టణాలు అన్నీ నీటమునిగాయి. తమ ఇళ్లన్నీ వరదలు ముంచెత్తడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్కూళ్ళు, కాలేజీలు మూతబడ్డాయి. పలు వాహనాలు నీట మునగగా.. మూగజీవాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. వరదలు, వర్షాల ధాటికి బుధవారం ఒక్క రోజులోనే 10 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 41కు చేరింది.
భారీ వరదలతో అస్సాంలోని సుమారు 8 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు అసోంలోని పలు జిల్లాల్లో వరదనీరు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో పాక్షికంగా చిక్కుకున్న వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. తమ ఇళ్లు, పంటలు, పశువులు, జీవనాధారాలను కోల్పోయిన ప్రజలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
అటు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రక్షణ బృందాలు, విపత్తు నిర్వహణ సిబ్బంది, స్థానిక అధికారులు రంగంలోకి దిగి నిర్విరామంగా పనిచేస్తున్నారు. పడవలు, ఇతర రక్షణ పరికరాల సహాయంతో నీటిలో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసుకువస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సహాయం, తాత్కాలిక నివాసం వంటి ప్రాథమిక సదుపాయాలను అధికారులు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో వచ్చే నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

