కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ (Karimnagar)లో ఓ సెలూన్ షాప్‌లో ‘అన్నా’ అన్నందుకు వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడ్డ ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ఎస్సై చందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శనివారం కరీంనగర్‌లోని ఖాన్‌పురాలో మూడో టౌన్ ఎస్సై చందర్ (SI Chandar) ఓ సెలూన్ షాప్‌కు వెళ్లారు. షాప్‌లో ఉన్న నాయి బ్రాహ్మణుడు రాములు ‘అన్నా కూర్చో’ అని చందర్‌ను కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై నన్నే అన్నా అంటావా అంటూ రాములుపై దాడికి దిగాడు. బూతులు తిడుతూ రాములను చితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించి ఘటనపై విచారణ చేపట్టారు. ఎస్సై చందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

