కలం, స్పోర్ట్స్ : జింబాబ్వేతో హరారేలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలవడంతో టీ20 అంతర్జాతీయాల్లో భారత కెప్టెన్‌గా వరుసగా ఎనిమిదోసారి టాస్ గెలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న వరుసగా ఏడు టాస్ విజయాల రికార్డును అధిగమించాడు. ధోనీ ఈ ఘనతను 2010 నుంచి 2012 మధ్య సాధించగా, శ్రేయస్ అయ్యర్ జూన్ 2026 నుంచి జూలై 2026 వరకు ఎనిమిది వరుస టాస్ విజయాలు నమోదు చేశాడు.
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ ఆరు వరుస టాస్ విజయాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ చెరో ఐదు వరుస టాస్ విజయాలు సాధించిన కెప్టెన్లుగా నిలిచారు. టాస్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. హరారేలో తాను తొలిసారి ఆడుతున్నప్పటికీ, ప్రాక్టీస్ వికెట్లను చూసినప్పుడు పిచ్‌పై మంచి బౌన్స్ కనిపించిందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
అలాగే గత రెండేళ్లుగా జింబాబ్వే జట్టు మంచి ఆటతీరు కనబరుస్తోందని ఆయన ప్రశంసించాడు. బ్యాటర్లు, బౌలర్లు తమ బలాలను బాగా ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కూడా ఈసారి హరారే పిచ్ సాధారణంగా ఉండేదానికంటే భిన్నంగా కనిపిస్తోందని చెప్పాడు. ప్రారంభంలో పేసర్లకు కొంత సహాయం ఉన్నా, ఈ వికెట్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, రింకు సింగ్‌లతో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. జింబాబ్వే తరఫున న్యూమన్ న్యామ్‌హురి, బెన్ కరన్ టీ20 అంతర్జాతీయాల్లో అరంగేట్రం చేశారు. హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మిల్టన్ షుంబా సిరీస్‌కు దూరం కావడంతో, అతని స్థానంలో ఇన్నోసెంట్ కాయాను జట్టులోకి తీసుకున్నారు.

