కేరళ స్టోరీ 2 వివాదం.. జాతీయ క్రీడాకారిణి సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​: ది కేరళ స్టోరీ 2 సినిమా వివాదంపై జాతీయ క్రీడాకారిణి తారా సహదేవ్ ​(Tara Shahdeo) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో బలవంతపు మత మార్పిడులు, లవ్​ జిహాద్​పై కొన్ని నిజ జీవిత సంఘటనలు చూపించారని, అందులో తారా సహదేవ్ ​పెళ్లి గురించీ ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఓ మీడియాతో ఆమె​ మాట్లాడారు. తాను బాధితురాలిగా మారే వరకు ‘లవ్​ జిహాద్​’కు (Love Jihad) అర్థమే తెలియదన్న ఆమె.. ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు ఈ విష వలయంలో చిక్కుకొని, బయటకు రాలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా దీని గురించి చర్చించడం మంచి పరిణామమని, దీని వల్ల అమ్మాయిలు జాగ్రత పడతారని పేర్కొన్నారు.

‘నా కేసు 2014లో జరిగింది. అప్పుడే నేను మొదటి సారిగా లవ్​ జిహాద్(Love Jihad)​ అనే పదం మీడియా ద్వారా విన్నాను. అంతకుముందు దాని అర్థం కూడా నాకు తెలియదు. ఇప్పటికీ లవ్ జిహాద్​ బాధితులుగా మారిన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు ధైర్యంగా మన ముందుకు రాలేకపోతున్నారు. కారణం.. ఇది అమ్మాయిలు తమంతట తాము చేసుకున్న స్వయంకృతాపరాధం అని ప్రజలు అనుకోవడమే. అందువల్లే, నా విషయంలోనూ ఎవరూ అర్థం చేసుకోలేదు. అందుకే 10, 12 ఏళ్లుగా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. గతంలోనే దీని గురించి సమాజం అర్థం చేసుకొని నాతోపాటు ఎంతో మంది జీవితాలు ఇలా ఉండేవి కావు. అయితే, ప్రస్తుతం పరిస్థితి మారింది. లవ్​ జిహాద్​ గురించి సమాజం అర్థం చేసుకుంటోంది’ అని ఆమె అన్నారు.

తారా సహదేవ్​ కథేంటి?

జార్ఖండ్​లోని (Jharkhand) రాంచీకి చెందిన తారా సహదేవ్ (Tara Shahdeo)​ షూటింగ్​లో జాతీయ స్థాయి క్రీడాకారిణి. 2014లో రంజిత్​ కుమార్​ కోహ్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఆమెకు షాకింగ్​ విషయం తెలిసింది. తన భర్త అసలు పేరు రఖిబుల్ హసన్​ ఖాన్​ అని తెలుసుకుంది. ఆ తర్వాత ఆమెను మతం మారమంటూ భర్త, అత్తమామలు వేధించడం ప్రారంభించారు. దారుణమైన చిత్రహింసలకు గురిచేశారు. ఈ క్రమంలో విసిగిపోయిన తారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇది ‘లవ్​ జిహాద్​’ విషయమని గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసులో రఖిబుల్​ హసన్​కు జీవిత శిక్ష పడింది.

ద కేరళ స్టోరీ 2 వివాదం..

మతమార్పిడులు, లవ్ జిహాద్​పై సుదీప్తో సేన్​ దర్శకత్వంలో 2023లో ‘ది కేరళ స్టోరీ’ సినిమా వచ్చింది. దీనిపై అప్పట్లో తీవ్ర వివాదాలు రేకెత్తాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ ఆందోళనలు జరిగాయి. అయితే, అవాంతరాలన్నీ దాటుకొని విడుదలైన ఆ సినిమా ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్​గా ‘ది కేరళ స్టోరీ 2’ను (The Kerala Story 2) డైరెక్టర్​ కామాఖ్య నారాయణ సింగ్​ తీశారు.

ఇది ఈ నెల 27న రిలీజ్​ కావాల్సి ఉంది. అయితే, విడుదలకు ముందే ఈ సినిమా కూడా వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్​లో అభ్యంతరకర డైలాగులు ఉన్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కనిపిస్తోందని, సినిమాలో కేరళను తప్పుగా చూపించారని కోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై ప్రస్తుతం కేరళ హైకోర్టు విచారణ జరుపుతోంది. వివాదాస్పద చిత్రం టైటిల్​లో కేరళ పేరు ఉండడంతో తాము జోక్యం చేసుకున్నామన్న హైకోర్టు.. దీనిపై కేంద్రానికి, సెన్సార్​ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. బుధవారం (ఈ నెల 25న) తాము సినిమా చూస్తామని, ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

Read Also: సినిమా ఫ్లాఫ్.. హీరోయిన్ మాత్రం సూపర్ హిట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>