కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై పడటం మొదలైంది. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన ‘నయారా ఎనర్జీ’ తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price Hike) పెంచింది. లీటరు పెట్రోల్‌పై రూ. 5 వరకు.. డీజిల్ పై రూ. 3 వరకు పెంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘నయారా ఎనర్జీ’ సంస్థ వెల్లడించింది. కాగా, నయారా ఎనర్జీకి భారతదేశంలోని మొత్తం 1,02,075 పెట్రోల్ బంకులలో 6,967 కేంద్రాలు ఉన్నాయి. రష్యాకు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ ‘రోస్నెఫ్ట్’ ఈ కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉంది.
అయితే నయారా ఎనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, రిలయన్స్, బిపి సంయుక్త భాగస్వామ్యమైన ‘జియో-బిపి’, ప్రభుత్వ రంగ సంస్థలు సాధారణ గ్రేడ్ పెట్రోల్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగానే ఉంచాయి. ఇదిలాఉంటే ‘హోర్ముజ్ జలసంధి’ మూసివేయడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరగవచ్చనే భయం, సరఫరా నిలిచిపోవచ్చనే వార్తల నేపథ్యంలో ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వాహనదారులు పుకార్లను నమ్మొద్దని సూచిస్తుంది.

