కలం, వెబ్ డెస్క్: ఏపీలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నిరుపేద మహిళ రాధమ్మ (65) అనారోగ్యంతో మృతిచెందింది. కావాల్సిన డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని (Dead Body) చెత్త రిక్షాలో తరలించారు. రాధమ్మ అనే మహిళ భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆస్పత్రిలో అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో మృతదేహాం తరలింపునకు కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనాన్ని ఆశ్రయించారు. రూ.2,500 అడగడంతో దిక్కుతోచని స్థితిలో చెత్త రిక్షాపై డెడ్ బాడీని తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృతదేహాల తరలింపునకు అంబులెన్స్ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని వైద్యులు తెలిపారు.
గత కొన్నేళ్లుగా ఏపీలో పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్‌ల (Ambulance) కొరత ఏర్పడింది. వాహనాల సంఖ్య తగ్గడం, మరికొన్ని పాతబడటంతో కొరత ఏర్పడింది. అలాగే నిర్వహణ, ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాల నిధులు సమయానికి అందకపోవడం కూడా కారణం. ప్రధాన ఆస్పత్రుల్లో అంబులెన్లు అందుబాటులో ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టుగా లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.


