కలం, వెబ్ డెస్క్ : అడ్వర్టైజింగ్ రంగంలో కాంట్రాక్ట్ కోసం న్యాయబద్ధంగా అవకాశం ఇవ్వాలని కోరిన తనను సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉండే ఓ వ్యక్తి గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచారని ఆరోపిస్తూ మిథున అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని కె. శోభారెడ్డి (Shobha Reddy) సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె మున్సిపల్ శాఖలో భారీగా అవినీతి జరుగుతుందని.. తనకు సీఎం అపాయిట్మెంట్ ఇస్తే తనపై వేధింపుల వివరాలను, అలాగే మున్సిపల్ శాఖలో శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా వెల్లడిస్తానని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
వీడియోలో ఆమె మాట్లాడుతూ… అడ్వర్టైజింగ్ కాంట్రాక్ట్ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరినందుకు, సీఎంకు సన్నిహితుడిగా చలామణి అవుతున్న ఒక వ్యక్తి తనను గెస్ట్‌హౌస్‌కు రమ్మని పిలిచి వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని , కాంగ్రెస్ నాయకుడి వల్లే తాను తీవ్ర ఇబ్బంది పడ్డాను అనేది పచ్చి నిజం అని శోభారెడ్డి స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విషయంలో తనకు సాయం చేస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఫయీం ఖురేషి, రోహిన్ రెడ్డిలను ‘అన్నా’ అని పిలిచి సహాయం కోరానని, అయితే వారు హామీ ఇచ్చినా చేయలేదని తెలిపారు. దాంతో చేసేదేమీ లేక సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో నేతను సంప్రదించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు తాను తీవ్రమైన పేదరికం నుంచి వచ్చి వ్యాపారవేత్తగా ఎదిగానని చెప్పారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, దయచేసి తనపై ఎలాంటి అపనిందలు వేయవద్దని కోరారు. ఈ క్రమంలోనే “రేవంత్ రెడ్డి సర్.. ప్లీజ్ నాకు ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వండి” అని శోభారెడ్డి కన్నీళ్లతో అభ్యర్థించారు. సీఎం సన్నిహితుడిపై కె. శోభారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు ఆమె ఆరోపణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

