Mobile Popup Ad
Mobile Popup Ad

బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోతాను: షేక్ హసీనా

కలం, వెబ్ డెస్క్: ఈ ఏడాదే తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. తాను భారత్‌లో ఉన్నప్పటికీ, మనసంతా బంగ్లాపైనే ఉందన్నారు. ప్రజల హక్కులు పునరుద్ధరించడానికి, బంగ్లాదేశ్‌లో తిరిగి ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి అక్కడకు వెళ్లడం తప్పదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా దిల్లీలోని రహస్య ప్రాంతంలో షేక్ హసీనా ఉంటున్నారు. ఆమె వివరాలను భారత ప్రభుత్వం ఎప్పుడూ వెల్లడించలేదు.

ప్రజల కోసమే అధికారం..

అధికారం రాజకీయాలు చేసేందుకు కాదని, ప్రజలకు మంచి చేయడానికి మాత్రమే అన్నది తాను నమ్మిన సిద్ధాంతమని షేక్ హసీనా (Sheikh Hasina) వివరించారు. బంగబంధు, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ కన్న కలలు నిజం చేయడమే లక్ష్యమన్నారు. కోర్టులు ఇచ్చిన మరణశిక్ష, జీవిత ఖైదు తీర్పులు పూర్తిగా అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. అవి రాజకీయ ప్రేరేపితమైనవి.. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలను వేధించే సాధనాలుగా కోర్టులు మారిపోయాయని మండిపడ్డారు.

మా పార్టీకి గొప్ప చరిత్ర ఉంది..

గొప్ప చరిత్ర కలిగిన అవామీ పార్టీని రద్దు చేసినంత మాత్రాన కాలగర్భంలో కలిసిపోదని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. తమ పార్టీ పేపర్ మీద లేదని.. బంగ్లా నేలలో పాతుకుపోయిందన్నారు. గత 77 ఏళ్ల కాలంలో అవామీ లీగ్ పార్టీపై (Awami League Party) ఎన్నో దాడులు జరిగాయని.. కార్యకర్తలు రక్తం చిందించారన్నారు. ఎన్నో సార్లు నిషేధాన్ని ఎదుర్కొందని.. ప్రతీసారి ప్రజల మద్దతు తిరిగి పుంజుకుందన్నారు. తమ పార్టీ తిరిగి లేవడం అనేది ప్రభుత్వం చేతుల్లో లేదని.. ప్రజల్లో చేతుల్లో ఉందని తేల్చి చెప్పారు.

భారత్‌తో ప్రత్యేక అనుబంధం..

1975లో కూడా తాను ఇండియాలో ఆశ్రయం పొందినట్లు షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. తనకంటూ వ్యక్తిగత జీవితమేదీ లేదని.. బంగ్లా ప్రజల సేవకే ఎప్పుడో అంకితమైపోయినట్లు వివరించారు. కుటుంబసభ్యులతో నిత్యం మాట్లాడుతూనే ఉంటానన్నారు. బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి, అక్కడ ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టాలనేదే తన లక్ష్యమన్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కార్యకర్తలు, నేతలను కలిసి మాట్లాడాలని ఉందన్నారు.

Read Also: అమ్రాబాద్ అడవుల్లో అరుదైన అతిథి!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>