కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లోని సైన్స్ వింగ్ కళాశాల (Science Wing College) విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను నాయకులు సర్వే చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల నేడు కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్స్ లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలకు మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని వాపోయారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న సైన్స్ వింగ్ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్స్ నిర్వహించాలని చెప్తున్నప్పటికీ.. కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని మండిపడ్డారు. కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్ర వ్యాప్తంగా లేవన్నారు.
రోజు రోజుకి విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న గానీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదు అని ప్రశ్నించారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుందన్నారు. కావున తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్ జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

