కలం, వరంగల్ బ్యూరో : ఖిలా వరంగల్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరు కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణం (Warangal Land Scam)పై జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి విచారణను వేగవంతం చేశారు. ఈ స్కాంకు సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.
బుధవారం ఉదయం ఖిలా వరంగల్ తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్ అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భూ అక్రమాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, బాధ్యులైన అధికారులను విచారించడం ప్రారంభించారు. ఇందులో భాగంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO), స్థానిక తహసిల్దార్‌లను ఒకరి తర్వాత ఒకరిగా విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు.
కుంభకోణం జరిగిన తీరు, దానికి సహకరించిన వారి వివరాలపై ల్యాండ్ రికార్డులను దగ్గర పెట్టుకుని అడిషనల్ కలెక్టర్ నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జి పి ఓ, ఆర్ ఐ, తహసిల్దార్ల నుంచి ఆమె స్వయంగా కీలక స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. ఈ భారీ భూ అక్రమాల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

