కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధ్యక్షతన శనివారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూరు, కౌలాస్‌నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాలలో నీటి నిల్వలు, ఆయకట్టు పంటలకు సాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు.
ఎల్‌నినో ప్రభావంతో ముందస్తు చర్యలు
ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధారణంగా రబీ సీజన్‌లో సాగునీటి సరఫరాపై చర్చించేందుకు జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వ సూచనల మేరకు ఖరీఫ్ సీజన్‌లోనే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజులలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇంకా పంటలు సాగు చేయని రైతులను ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లించేలా రైతు వేదికల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.
నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలి
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. చెరువులకు ఎక్కడా గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బోరుబావులపై ఆధారపడి అధిక సంఖ్యలో రైతులు సాగు చేస్తున్నందున భూగర్భ జలాల పెంపునకు వాటర్‌షెడ్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
ఆర్మూర్ ఆయకట్టుకు సాగునీరు అందించాలి
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ నిజాంసాగర్ చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్ నియోజకవర్గానికి కాలువలు సక్రమంగా లేక సాగర్ జలాలు అందడం లేదన్నారు. ప్రస్తుతం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 40 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోందని తెలిపారు. సాగునీటి కొరత కారణంగా అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారని, ప్రస్తుత పరిస్థితులలోనూ సాగునీరు అందకపోతే మరింత మంది గల్ఫ్ బాట పట్టే ప్రమాదం ఉందని అన్నారు. ఆర్మూర్, ఆలూర్, నందిపేట తదితర మండలాల ఆయకట్టుకు ఎత్తిపోతల పథకాల ద్వారానైనా సాగునీరు అందించాలని కోరారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేలా సమగ్ర ప్రణాళిక
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను సవాల్‌గా స్వీకరించి ప్రజలను దాని ప్రభావం నుంచి కాపాడేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నీటి వనరులు వృథా కాకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్‌ఓ గీతతో పాటు ఇరిగేషన్, గ్రౌండ్‌వాటర్, వ్యవసాయ, ఉద్యానవన తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

