కలం, భువనగిరి: భువనగిరి మాజీ ఎమ్మెల్యేకొమ్మిడి నర్సింహారెడ్డి (Kommidi Narasimha Reddy) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఆయన స్వగృహానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలతో కలిసి చేరుకుని, నర్సింహారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి అంతిమయాత్రలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొని పాడె మోశారు.
నర్సింహారెడ్డి అంత్యక్రియలకు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజలు వేలాదిగా తరలివచ్చి అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. “కొమ్మిడి నర్సింహారెడ్డి ప్రజలకు నీతి, నిజాయితీ, నిబద్ధతతో సేవలందించిన గొప్ప ప్రజానాయకుడు. ప్రజాసేవనే పరమావధిగా భావించి నిరంతరం శ్రమించిన ఆయన.. రాజకీయాల్లో నిరాడంబరతకు, విలువలకు నిలువెత్తు రూపం. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయం.” అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో స్వర్గీయ కొమ్మిడి నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విశేషంగా కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, పేదల సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున భూదానం చేసిన గొప్ప దాతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఈ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, భువనగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వర్గీయ నర్సింహారెడ్డికి ఘన నివాళులర్పించారు.

