భగ్గుమంటున్న భానుడు.. 44 డిగ్రీలు దాటనున్న టెంపరేచర్!

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లా వ్యాప్తంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. ఏప్రిల్ నెల మధ్యలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక మే నెలలో ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి వేడిని తట్టుకోలేని వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. గురువారం ఖమ్మంలో ఉష్ణోగ్రతలు (Temperatures) 43.2 డిగ్రీ సెంటిగ్రేడుగా నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు వంటి సింగరేణి గనులు ఉన్న ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నల్లటి బొగ్గు పొరలు వేడిని ఎక్కువగా గ్రహించి తిరిగి వెదజల్లడం వలన గాలిలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం అయ్యేసరికి రోడ్లన్నీ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. దీంతో జనసంచారం లేక రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు జిల్లాలో వడ గాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఖమ్మం (Khammam) జిల్లా, గట్టుసింగారం గ్రామానికి చెందిన చౌడయ్య (50) అనే రైతు ఇటీవల వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లి తీవ్రమైన ఎండ వేడిమిని తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. స్థానికులు ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు సురక్షా బస్టాండ్ దగ్గర ఓ వృద్ధుడు వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోవడంతో అతడిని స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. మరో వైపు మణుగూరు కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో బొగ్గు లోడింగ్ కోసం ఎండలో రెండు గంటలు నిలిపి ఉంచిన టిప్పర్ లారీ క్యాబిన్ అగ్నికి ఆహుతి అయింది. కార్మికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి ఇంజిన్ భాగం దగ్ధం అయ్యింది. అలాగే ఎండకు పెట్టిన బైకులలో పెట్రోలు ఆవిరి అయిపోతుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

సింగరేణి కార్మికుల డిమాండ్లు

ముఖ్యంగా జిల్లాలోని సింగరేణి (Singareni) ప్రాంతాల్లో పనిచేసే కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులు ఉదయం 6 గంటల నుంచి షిఫ్ట్ ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే పని ప్రదేశాల్లో వడ దెబ్బ తగలకుండా ఉండేందుకు చలువ పందిళ్లు, చల్లటి నీళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ గనులు, డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు, ఓబీ వర్కర్లకు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు, ప్రైవేట్ వాహన డ్రైవర్లకు, ఉద్యానవనాలు, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. పని ప్రదేశంలో ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చికిత్స అందించేలా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read Also:  మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. రమావత్ మధు అరెస్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>