రిటైర్మెంట్ కాదు.. రీఎంట్రీకి సిద్ధమైన గుత్తా సుఖేందర్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో : రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ముగింపు కాదని, అది కేవలం ఒక విరామమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) మరోసారి నిరూపిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ, ఆయన మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటివరకు వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించిన గుత్తా, తాజాగా స్వయంగా ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో కొత్త తరానికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించడం ప్రత్యర్థులకు షాక్ ఇచ్చింది. ఇక తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని రాజకీయ వారసుడిగా నిలబెట్టేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) గత కొంతకాలంగా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్‌లో అమిత్ భవిష్యత్తుపై స్పష్టత రాకపోవడంతో రాజకీయ అవసరాల రీత్యా కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రస్తుతం అమిత్ రెడ్డికి విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కేలా చేసి, ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అమిత్ రెడ్డిని నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో చురుకుగా పనిచేయించేలా వ్యూహాలు రచిస్తూ, స్థానిక రాజకీయాల్లో తన వర్గాన్ని బలోపేతం చేస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో తన వారసుడికి బలమైన పునాది ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రాబోయే డీలిమిటేషన్ గుత్తా రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో కొత్తగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా మారే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో గుత్తా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇప్పటివరకు కుమారుడి కోసం సీటు వదులుకుంటానని చెప్పిన గుత్తా, ఇప్పుడు తానే పోటీ చేస్తానని ప్రకటించడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తండ్రీకొడుకులకు ఇద్దరికీ అవకాశాలు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also: స్వీయ జనగణనలో వివరాలు నమోదు చేసిన సీఎం చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>