కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమయ్యాయి. ఉదయం నుంచే భానుడి భగభగలు మంటెక్కిస్తున్నాయి. బయటకు వెళ్లిన కాసేపటికే చెమటతో శరీరం తడిసిపోతోంది. ఇంట్లో ఉంటే ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు (IMD Alert) చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని హెచ్చరించింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 14వ తేదీన రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని, అలాగే పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల్లో వడగాల్పులు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వార్నింగ్ (IMD Alert) ఇచ్చింది.
తగిన జాగ్రత్తలు అవసరం..
ప్రజలు అవసరం అయితే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని, బటయటకు వెళ్తే.. టోపీ, గొడుగు తీసుకువెళ్లాలని సూచించింది. మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకోవాలని సూచించింది.

