కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. సభల్లో తమ పార్టీ వాదనలు వినిపించేందుకు ఆయా అంశాలపై మాట్లాడేందుకు సభ్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాజ్యసభ ఎంపీలకు ఆమ్ ఆద్మీ, జనతాదళ్ పార్టీలు త్రీ లైన్ విప్ (Three Line Whip) జారీ చేశాయి. ఈ నెల 16, 17, 18న తప్పనిసరిగా సభకు రావాలని ఆదేశాలు జారీ చేశాయి. సభలో కీలకమైన బిల్లులు ప్రవేశపెడుతుండడంతో విప్‌లు జారీ చేశాయి. సభ జరిగే మూడు రోజుల పాటు అందుబాటులో ఉండాలని, పార్టీ తీసుకునే నిర్ణయాలను మద్దతుగా నిలవాలని విప్ లో ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టనుంది.
అటు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు సైతం ఇదివరకే విప్ లు జారీ చేశాయి. కీలక బిల్లులపై చర్చించనుండటంతో తమ ఎంపీలకు అత్యంత కఠినమైన త్రీ-లైన్ విప్ బీజేపీ (BJP) జారీ చేసింది. ఏప్రిల్ 16 నుండి 18 వరకు లోక్సభ, రాజ్యసభలోని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలో ఉండాలని పార్టీ ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున, సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరింది. ఇక ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం తమ లోక్ సభ ఎంపీలకు త్రీ – లైన్ విప్ (3 Line Whip) జారీ చేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమావేశాల్లో సభలో కీలక అంశాలపై చర్చ, ఓటింగ్ జరగనున్నాయని పార్టీ ప్రకటనలో పేర్కొంది. నారీ శక్తి వందన అధినియమ్ సవరణ బిల్లుపై పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఎంపీలను కోరింది. పార్టీ జారీ చేసే అత్యంత కఠినమైన ఆదేశం త్రీ – లైన్ విప్ కావడంతో సభ్యులు తమ పార్టీ ఆదేశాలు మేరకు సభకు హాజరయ్యేందుకు, సభలో ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. కీలక బిల్లుల ఆమోదం జరగనుండడంతో ఈ మూడు రోజులు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

