కలం, వెబ్ డెస్క్: వేములవాడ (Vemulawada) లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అనారోగ్యంతో చావుబతుకుల మధ్య పోరాడుతున్న మర్రిపల్లి రాకేష్‌ను కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక వేములవాడలోని వైకుంఠధామానికి తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. బతికుండగానే స్మశానానికి తీసుకెళ్లాల్సిన దుస్థితి రావడంతో కుటుంబ సభ్యుల ఆవేదన అందరినీ కలచివేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత కుటుంబం కొన్నేళ్లుగా వేములవాడలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె కుటుంబ సభ్యుడు రాకేష్ కొంతకాలంగా జాండీస్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రోజురోజుకూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
మరోవైపు రాకేష్ అనారోగ్య పరిస్థితిని చూసి ఇంటి యజమాని అద్దె ఇంట్లోకి కూడా అనుమతించలేని పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు వాపోయారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రాకేష్‌ను వైకుంఠధామానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ కుటుంబం తీవ్ర కష్టాల్లో ఉందని, రాకేష్‌కు తక్షణ వైద్య సహాయం అందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను వేడుకుంటున్నారు.

