కలం, కరీంనగర్: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూమార్ మార్గనిర్దేశంతో “డివిజన్ బాట… మేయర్ మాట” శ్రీకారం చుట్టామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో బాగంగా శుక్రవారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ సరికొత్త కార్యక్రమాన్ని 9 వ డివిజన్లో లాంచనంగా ప్రారంభం చేశారు. డివిజన్లోని కోతిరాంపూర్, అల్కపురి ప్రాంతాల్లో స్థానిక కార్పోరేటర్ పాడిశెట్టి వసంత లక్ష్మీ భూమయ్య, అధికారులు, సిబ్బందితో కలిసి పర్యటించారు.
గల్లీ గల్లీలో పాదయాత్ర
ఉదయం స్థానిక కార్పొరేటర్ పాడిశెట్టి వసంత లక్ష్మీ-భూమయ్యతో కలసి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డివిజన్లోని వీధులన్నీటిలో పాదయాత్ర చేశారు. ఇంటింటికి వెళ్తూ… మహిళలు, స్థానిక ప్రజలను నేరుగా కలిశారు. స్థానికంగా ఎదుర్కుంటున్న రోడ్లు, డ్రైనేజీ, త్రాగు నీరు, వీధి దీపాలు, పారిశుధ్యం లాంటి తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ప్రజలు దృష్టికి తెచ్చిన స్థానిక డ్రైనేజీ, రోడ్ల సమస్యలను తనిఖీ చేశారు.
పలు కాలనీలలో దెబ్బతిన్న రోడ్లు, శిథిలమై ఉప్పొంగుతున్న మురుగు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యల పరిష్కార దిశగా ఇంజనీరింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్దం చేసి… సరైన లెవల్స్ తో పనులు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి 10 రోజులకు ఒక డివిజన్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచన మార్గనిర్దేశం ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి పది రోజులకు ఒక డివిజన్ లో ” డివిజన్ బాట… మేయర్ మాట” కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…: “కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలోచనల మేరకు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కారించేలా ” డివిజన్ బాట.. మేయర్ మాట” కు నాంది పలికామని తెలిపారు. ప్రతి 10 రోజులకు ఒక డివిజన్ చొప్పున నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పర్యటించేలా ప్రణాళిక వేశామని తెలిపారు.
ప్రజల సమస్యల ప్రాధాన్యతగా డివిజన్లను ఎంపిక చేసి… నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. ప్రజలు మా దృష్ఠికి తెచ్చిన సమస్యను త్వరగా పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు చేసి… సమస్య తీవ్రతను బట్టి క్షేత్రస్థాయిలో తగిన నిర్ణయాలు తీస్కుంటామని తెలిపారు. మొదటి రోజు కార్యక్రమంలో 9 వ డివిజన్ కోతిరాంపూర్, అల్కపురి ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నామని తెలిపారు. దృష్టికి తెచ్చిన సమస్యల ప్రజలకు హామీ ఇచ్చి… వాటి పరిష్కారం దిశగా ఇంజనీరింగ్ అధికారులు సిబ్బందికి ఆదేశించామని తెలిపారు.
సంబంధిత డివిజన్ లో ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన డంపింగ్ యార్డు ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డు సమస్య స్థానిక ప్రజలను గత 40 ఏళ్ళుగా పట్టిపీడిస్తుందని…కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచన… ఇచ్చిన మాటకు కట్టుబడి డంపుయార్డు సమస్యకు స్వచ్చ్ భారత్ మిషన్ స్కీంలో 17 కోట్లు కేటాయించి బయోమైనింగ్ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే సంవత్సరా కాలంలో డంపుయార్డు సమస్యను తొలగిస్తామని స్పష్టం చేశారు. మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారంతో స్వచ్ బారత్ మిషన్ స్కీంలో అదనంగా మరో 20 కోట్లు తెస్తామన్నారు.
ఇప్పటికే యూసిఎఫ్ స్కీంలో డంపింగ్ యార్డు కు 80 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఉన్న చెత్తతో పాటు వచ్చే చెత్తను కూడ ప్రాసెసింగ్ పద్దతిలో ప్రక్షాళన చేస్తామని… త్వరలోనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు కొంత సంయమానం పాటించాలని సూచించారు. డంపింగ్ యార్డు బర్నింగ్ సమస్యకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించి… చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.
డివిజన్ బాట… మేయర్ మాట కార్యక్రమంలో నగర ప్రజల సమస్యలకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపిస్తామన్నారు. కరీంనగర్ నగరాన్ని ఇచ్చిన మాట ప్రకారం… పరిశుభ్రతలో అభివృద్ధి లో ముందు వరసలో నిలుపుతామని… ఆ దిశగా మా పాలకవర్గం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వేణుమాధవ్, డీఈ దేవేంధర్ రెడ్డి, ఏఈ భీంవర్ధన్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, ఎస్సై శ్రీధర్, డివిజన్ ప్రజలు, సిబ్బందికి పాల్గొన్నారు.

