కలం, వెబ్ డెస్క్: తిరుపతి (Tirupati) నగరంలోని పలు లగ్జరీ హోటళ్లలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలనే దుండగులు టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల రూ.ఇరవై లక్షలు మాయం కాగా. తాజాగా 1,000 అమెరికన్ డాలర్లు మాయం అయ్యాయి. అయితే ఒకే హోటల్ లో రెండు చోరీ ఘటనలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి దొంగల పనే కావొచ్చు అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో చోరీ ఘటనలు జరిగాయి.
వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్ నుండి తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు ఎన్నారై ఆర్ముగం కుటుంబం వచ్చింది. మారస సరోవరం హోటల్ రూమ్ నెంబర్ 1017లో వీరు రూమ్ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ లో ఉంచిన 1000 డాలర్స్ మాయం అయ్యాయి. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్ విచారిస్తున్నారు. ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

