Mobile Popup Ad
Mobile Popup Ad

హుజూర్‌నగర్ అభివృద్ధిని కాంగ్రెస్ కుంటుపరిచింది: సైదిరెడ్డి

కలం, హుజూర్ నగర్ : గతంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎలాంటి కొత్త అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్ఆర్ఐ విభాగం రాష్ట్ర కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి (Shanampudi Saidireddy) విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని పని చేశామని, రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి మచ్చ లేకుండా పనిచేసే ఏకైక పార్టీ బీజేపీనేనని, ప్రజలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసమే ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు.

రైతులను, నిరుద్యోగులనే కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ అరాచకానికి పాల్పడుతోందని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం మట్టి మాఫియా రాజ్యమేలుతోందని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ, ప్రశ్నించిన వారిని జైళ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడి నుండి హైదరాబాద్ కు కారు మీద వెళ్లేవాళ్లమని.. కానీ నేడు ఇక్కడ ఉన్న మంత్రి మాత్రం రోడ్డు మార్గాన్ని వదిలేసి హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్ లో ఏ రోడ్డు చూసినా అది తమ హయాంలో వేసిందేనని సైదిరెడ్డి స్పష్టం చేశారు.

గతంలో అధికారుల సమక్షంలో నిరుపేదలకు తాము ఎమ్మెల్యేగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తే.. ఇప్పుడు ఆ పట్టాలకు అనుమతులు లేవంటూ అధికారులు, పాలకులు అంటుండటం దుర్మార్గమన్నారు. పేదల కోసం గతంలో తాము డబుల్ బెడ్రూం ఇళ్ల కొరకు నిధులు శాంక్షన్ చేయించామని, అదే జీవోతో ఇప్పుడు పనులు చేస్తున్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తామన్న సింగిల్ బెడ్రూం ఇండ్ల ప్రక్రియ గత మూడేళ్లుగా వాయిదా పడుతూనే ఉందన్నారు. అంతేకాకుండా, తాము ప్రారంభించిన మినీ ట్యాంక్ బండ్ పనులను, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆపివేసిందని ఆరోపించారు.

హుజూర్ నగర్ కు ఈఎస్ఐ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, ఈసీజీ సెంటర్లను తీసుకువచ్చింది తామేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని సైదిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం గంజాయి మయంగా మారిందని, డ్రగ్స్ దందా ప్రతి పల్లెటూరుకు పాకిందని ఆరోపించారు. నిన్న కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఘర్షణకు 15 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు గంజాయి మత్తులో ఉండటమే కారణమని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగిన వ్యక్తినని, కేవలం రాజకీయం కోసం కాకుండా హుజూర్ నగర్ అభివృద్ధి కోసమే వచ్చానని సైదిరెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో హుజూర్ నగర్ లో గెలవబోయేది బీజేపీయేనని, నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం తాను ఇక్కడే ఉండి పనిచేస్తానని భరోసా ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>