కలం, ములుగు: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని మంత్రి సీతక్క (Seethakka) ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోని నాయకులు, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని చెప్పడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని విమర్శించారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో సోమవారం నూతన డిగ్రీ కళాశాలతో పాటు మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క.. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. అసెంబ్లీకి కూడా రావడం లేదని.. ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్ ప్రజా సమస్యల కంటే సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది మీరే.. అది దెబ్బతిన్నది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే” అని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యల కారణంగా రైతులు యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో అధికారులు నేరుగా వెళ్లి రైతులకు ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

