నేను మంత్రి అవడం BRS వాళ్లకు ఇష్టం లేదు : సీతక్క

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ ఎస్ వాళ్లకు తాను మంత్రి అవడం అస్సలు ఇష్టం లేదని మంత్రి సీతక్క అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి తన మీద ద్వేషం ఉందని.. కానీ తనకు ఆమె మీద ఎలాంటి ద్వేషం లేదని సీతక్క చెప్పుకొచ్చారు. బీఆర్ ఎస్ వాళ్లు ఎంతసేపు తన శాఖల మీదనే ఆరోపణలు చేస్తున్నారని.. ఒక ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే తట్టుకోలేకపోతున్నారంటూ సీతక్క ఆవేదనగా మాట్లాడారు. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానాలు ఇచ్చారు. ఊర్లలో సర్పంచులు లేకపోవడంతో 15th ఫైనాన్స్ నిధులు రావట్లేదని.. అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు క్లియర్ కాకపోయినా తాము ఎన్నికలకు వెళ్లామని సీతక్క చెప్పుకొచ్చారు.

గ్రామాల సమస్యలపై సమీక్ష చేస్తున్నా..

ప్రతి ఊరికి తమ ప్రభుత్వం నిధులు ఇస్తోందని.. అందుకే ఊర్లలో పనులు జరుగుతున్నట్టు సీతక్క వెల్లడించారు. తమ ప్రభుత్వం ఇవ్వకపోతే ఊర్లలో పారిశుధ్య పనులు జరిగేవి కావని.. ఈ పాటికి ప్రజలు విషజ్వరాల బారిన పడేవారంటూ తెలిపారు సీతక్క. తాను ప్రతి రోజూ చాలా మంది సర్పంచులతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. ఏ ఊర్లో తాగునీటి సమస్యలు ఉన్నాయో, రోడ్ల సమస్యలు ఉన్నాయో సమీక్ష చేస్తున్నామని.. అన్నీ నెరవేర్చుతామన్నారు.

ఆ వ్యవస్థ ఎటుపోయింది..?

బీఆర్ ఎస్ హయాంలో తెచ్చిన ఈఎన్సీనే వాడుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల సమస్యలపై ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నామన్నారు. ‘ఒకసారి బాలుడు నీళ్ల పైపుతో ఆడుకుంటే సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ చేశారు. కేసీఆర్ ఉంటేనే నీళ్లు లేదంటే నీళ్లే రావు అన్నట్టు రకరకాల వీడియోలు చేస్తున్నారు. మరి మీ హయాంలో అంతా బాగా చేస్తే ఇప్పుడు ఆ వ్యవస్థ ఎటు పోయింది. గ్రామాలకు తాగునీరు ఎందుకు రావట్లేదు. ఈ అసెంబ్లీ కట్టిన నిజాం ఇప్పుడు లేడు. కానీ ఈ బిల్డింగ్ అలాగే ఉంది. అలాగే బీఆర్ ఎస్ వాళ్లు చేస్తే అవి ఉండాలి కదా’ అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.

మిషన్ భగీరథపై అవగాహన కల్పిస్తున్నాం..

గ్రామాల్లో మిషన్ భగీరథ మీద అవగాహన కల్పిస్తున్నామని.. ఆర్ వో వాటర్ తాగితే మినరల్స్ ఉండట్లేదు అనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పిస్తున్నామని సీతక్క వెల్లడించారు. ఇలా తాము మిషన్ భగీరథ గురించి అవగాహన కల్పిస్తుంటే నీళ్లు రావట్లేదు అని తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సీతక్క చెప్పారు. తమ ప్రభుత్వం రూ.57 వేల కోట్ల వడ్డీ రుణాలు ఇచ్చామంటే ప్రశ్నిస్తున్నారని.. కానీ బీఆర్ ఎస్ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రూ.3వేల కోట్లు పెట్టి కేవలం 6 కోట్లే మంజూరు చేశారన్నారు సీతక్క.

మేం అడవుల్లో ఉండేవాళ్లం..

తాను పదవుల కోసం ఆశపడలేదని.. టీడీపీలో చేరిప్పుడు అధికారంలో లేదని.. అలాగే కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు కూడా పార్టీ అధికారంలో లేదన్నారు మంత్రి సీతక్క. కానీ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ ఎస్ లోకి వెళ్లారని.. వాళ్లు వెళ్లొద్దని తాము ప్రయత్నాలు చేశామన్నారు సీతక్క. ‘సబితా ఇంద్రారెడ్డి ఉండేది సిటీకి దగ్గర్లో. మేం ఉండేది అడవుల్లో. వాళ్లకు మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆమె లాగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు’ అంటూ సీతక్క చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>