Mobile Popup Ad
Mobile Popup Ad

‘డాడీ’ అని పిలిచాడని 12 రోజులు దాచాడు: బాలుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్!

కలం, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కలకలం రేపిన ఐదేళ్ల బాలుడి (Secunderabad Child) కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. దారితప్పిన ఓ చిన్నారి అపరిచిత వ్యక్తిని ‘డాడీ’ అని పిలవడంతో, ఆ వ్యక్తి బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి 12 రోజుల పాటు ఇంట్లోనే దాచిపెట్టిన వింత ఘటన వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ చిలకనగర్ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్‌తో కలిసి విజయవాడ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అయితే, స్టేషన్‌లో ఉన్న సమయంలో బాలుడు నిఖిల్ అమ్మమ్మకు చెప్పకుండా బయటకు వచ్చాడు. దారితప్పి తిరుగుతున్న క్రమంలో, అక్కడ అతనికి చింతల్ రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏపీ రాజోలుకు చెందిన షేక్ అహ్మద్ అలీ అనే వ్యక్తి కనిపించాడు. చిన్నారి నిఖిల్ పొరపాటున అతడిని ‘డాడీ’ అని పిలిచాడు.

కుటుంబ కలహాల కారణంగా తన భార్య పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్న షేక్ అహ్మద్ అలీ.. తనను డాడీ అని పిలిచిన నిఖిల్‌ను ఎలాగైనా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లి 12 రోజుల పాటు రహస్యంగా ఉంచాడు.

టీవీ, సోషల్ మీడియాలో నిఖిల్ కిడ్నాప్ వార్తలు విస్తృతంగా రావడంతో నిందితుడు అహ్మద్ అలీ భయపడిపోయాడు. ఇక దాచడం సాధ్యం కాదని గ్రహించి, బాలుడిని నేరుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాడు. బాబుకు తీవ్ర జ్వరం రావడంతో మానవత్వంతో ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించానని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో జీడిమెట్ల పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం బాలుడిని తల్లి రాజేశ్వరికి అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>