కలం, ఖమ్మం బ్యూరో: సీతారామ ఎత్తిపోతల పథకం (Sitarama Project) ద్వారా సత్తుపల్లి ట్రంక్ పరిధిలోని ఆయకట్టుకు శాశ్వతంగా గోదావరి జలాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ మధ్య అవసరమైన 532 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు విడుదల చేస్తూ సోమవారం నిధుల మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి సారించి, ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాల్లోని భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావాలంటే నిధుల విడుదల తక్షణ అవసరమని కోరడంతో, నీటిపారుదల శాఖ సానుకూలంగా స్పందించి ఈ నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పరిధిలో మొత్తం 532 ఎకరాల భూమిని సేకరించనున్నారు.
ఈ నిధుల విడుదలతో దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాలు త్వరలోనే సస్యశ్యామలం కానున్నాయి. ఇప్పటి వరకు వర్షాధారంగా ఉన్న పంట పొలాలకు గోదావరి జలాలు సమృద్ధిగా అందడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సుమారు 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందే అవకాశం ఉందని అధికార యంత్రాంగం పేర్కొంది.
ప్రస్తుత సీజన్‌లోనే మూడో పంప్‌హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్ ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని, అందుకు తగ్గట్టుగా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను సమన్వయంతో వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూ.45 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

