కలం, ఖమ్మం బ్యూరో: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగా, కేసు విచారణలో కీలక పాత్ర పోషించి నేరం రుజువు అయ్యేలా సహకరించిన ప్రాసిక్యూషన్ బృందాన్ని, పోలీస్ అధికారులను సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) అభినందించారు. ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం 2024 ఫిబ్రవరి 24న ఖమ్మం వన్ టౌన్ పోలీసులు మమత హాస్పిటల్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన చెరువు బజార్‌కు చెందిన ఆటో డ్రైవర్ దుగ్గిరాల సూర్యనారాయణ (33)ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద లభించిన 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించగా, సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎన్ఎస్పీ రోడ్‌కు చెందిన పెయింటర్ గంటేల నరేష్ (32)తో కలిసి ఒడిశా నుంచి 5 కేజీల గంజాయిని ఖమ్మం తీసుకొచ్చినట్లు వెల్లడైంది. చెరో 2.5 కేజీలు పంచుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలడంతో, మొత్తం 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎన్‌డీపీఎస్ చట్టం-1985 కింద కేసు నమోదు చేశారు.
సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితులిద్దరికీ రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ పుల్లాభట్ల పొగడ కృష్ణ అర్జున్ తీర్పు చెప్పారు. కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన నాటి విచారణాధికారి ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ప్రస్తుత ఇన్స్పెక్టర్ కరుణాకర్, కోర్టు సిబ్బందిని సీపీ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.

