స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Polls) బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఇటీవల హైకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల గడువు ముగిసినందున వాటి ఎన్నికలను పాత విధానంలో నిర్వహించవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ తదుపరి కార్యాచరణపై ఫోకస్ పెట్టింది.
ఎన్నికల నిర్వహణపై SEC సమాలోచనలు…
ప్రభుత్వం తెచ్చిన జీవో 9 పై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఈ నెల 9న ప్రకటన విడుదల చేసింది. అయితే, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని, ఎన్నికలు నిలిపివేయాలని తమ ఉద్దేశం కాదని, రిజర్వేషన్ల జీవో మార్పును మాత్రమే ప్రతిపాదిస్తున్నామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Polls) నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాలోచనలు చేస్తోంది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో SEC కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో లీగల్ కౌన్సిల్ ఎన్నికల సంఘం ఓ లేఖ రాసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. హైకోర్టు(High Court) ఉత్తర్వులను పరిశీలిస్తున్న ఎలక్షన్ కమిషన్… సోమవారం న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
సుప్రీం కోర్టుకు తెలంగాణ సర్కార్…
బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ను సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధమైంది. సోమవారం సుప్రీంలో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నేడు న్యాయ నిపుణులు, సీనియర్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అలాగే ఈనెల 15న లేదా 16న తెలంగాణ కేబినెట్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై, హైకోర్టు తీర్పుపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరపనున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read Also: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు.. ఆ మాటలే కారణం..

