కలం, ఖమ్మం బ్యూరో: విధుల్లో ఉన్న పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో (Attacking Police) నిందితుడికి సత్తుపల్లి కోర్టు (Sathupalli Court) పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమీషనర్ బుధవారం వివరాలు వెల్లడించారు.
గతేడాది మార్చి 10, 2025న సత్తుపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఓ చోరీ కేసు నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, చిత్తాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య (36) పోలీసులపై ఉద్దేశపూర్వకంగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసుకు సంబంధించి సత్తుపల్లిలోని ఆరవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ వెలువరించిన తీర్పు ప్రకారం, సెక్షన్ 109 BNS కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా, సెక్షన్ 132 BNS కింద రెండేళ్ల సాధారణ కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా, అలాగే సెక్షన్ 121(1) BNS కింద ఏడాది సాధారణ కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీ దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

