కలం, స్పోర్ట్స్: భారత యువ స్క్వాష్ స్టార్ అనహత్ సింగ్ (Anahat Singh)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా ఉమెన్స్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ ఆడకుండానే ఆమె టోర్నీ నుంచి తప్పుకుంది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) తెలిపింది. దీంతో ఈజిప్ట్ క్రీడాకారిణి, టాప్ సీడ్ ఫెయిరూజ్ అబోల్ఖేర్ వాకోవర్‌తో సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్న అనాహత్.. ప్రీ క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన సరన్ న్గీమ్‌ను ఓడించి చివరి ఎనిమిది మందిలో చోటు సంపాదించింది. నాలుగు గేముల పాటు సాగిన పోరులో 11-6, 4-11, 11-5, 11-7తో విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్‌లో ఫెయిరూజ్‌తో తలపడాల్సి ఉండగా, గాయం అడ్డంకిగా మారింది.
ఇటీవల అమెరికాలో జరిగిన సిలికాన్ వ్యాలీ ఓపెన్‌లోనూ అనాహత్ ఆకట్టుకుంది. ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈజిప్ట్ క్రీడాకారిణి నూర్ ఎల్ షెర్బినీని ఓడించి కెరీర్‌లోనే కీలక విజయాన్ని అందుకుంది. ఆ టోర్నీలో సెమీఫైనల్ వరకు చేరింది. గత నెలలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లోనూ అనాహత్ (Anahat Singh) చరిత్ర సృష్టించింది. స్క్వాష్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఫైనల్లో మలేషియాకు చెందిన శివసంగరి సుబ్రమణియం చేతిలో ఓడినా రజత పతకాన్ని సాధించింది.
ఈ ఏడాది ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో బాలికల సింగిల్స్ టైటిల్ గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న అనాహత్.. గాయం కారణంగా కెనడా ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గాయం తీవ్రత, తిరిగి కోర్టులోకి వచ్చే సమయంపై ఇంకా స్పష్టత లేదు.
Also Read : జడేజా టాప్ ప్లేస్‌కు గండి..!
Follow Us On: Youtube

