కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ.దేవసేన (Devasena) స్పష్టం చేశారు. బుధవారం కూసుమంచి ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి ఈఆర్ఓలతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పై ఆమె ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఎ. దేవసేన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటరు జాబితా రూపకల్పనను పకడ్బందీగా చేపట్టాలన్నారు. స్వీకరించిన ఫారం 6, 6ఏ, 7, 8 దరఖాస్తులతో పాటు ఎన్ఆర్ఐల దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా డోర్-టూ-డోర్ సర్వే సక్రమంగా జరిగేలా చూడాలని, అత్యధిక చేర్పులు, తొలగింపులు జరిగిన పోలింగ్ కేంద్రాలను పునఃపరిశీలించాలని సూచించారు.
అలాగే యువ ఓటర్ల నమోదు, ఎపిక్ కార్డుల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ జిల్లాలోని ఓటర్ల గణాంకాలు పెండింగ్ దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,85,927 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 18-19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 11,596 మంది, 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 9,111 మంది, 23,588 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ద్వారా అదనంగా 19 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,479కి చేరిందని తెలిపారు. ఎపిక్ కవరేజ్ 99.99% పూర్తయిందని, ఎన్ఆర్ఐలవి 53 దరఖాస్తులు రాగా.. మొత్తం 4,172 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం వీటి పరిష్కారానికి చర్యలు వేగవంతం చేశామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.

