కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయ (Satavahana University) పరిధిలోని 15 గుంటల భూమిని కొత్తపల్లి పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (కార్యనిర్వాహక మండలి) నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 24న జరిగిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మల్కాపూర్ జంక్షన్ నుండి చింతకుంట వెళ్లే రహదారిలో, యూనివర్సిటీ వెస్ట్ గేట్ (పడమర ద్వారం) పక్కన ఉన్న స్థలాన్ని ఈ భవన నిర్మాణం కోసం కేటాయించామని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా దీనికి సంబంధించి అధికారికంగా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ను కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు గురువారం అందజేశారు.
ఈ సందర్బంగా పోలీసు కమీషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ Satavahana University పరిసర ప్రాంతాల్లో, కరీంనగర్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణను మరింత మెరుగుపరచడం కోసం యూనివర్సిటీలో కొత్తపల్లి పోలీసు స్టేషన్ శాశ్వత భవన నిర్మాణం, నిర్వహించడం ప్రజలకు మరింత సేవలందించేందుకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ విజ్ఞప్తి మేరకు, విద్యార్థుల భద్రత, ఈ ప్రాంతంలో నిరంతర నిఘా అవసరాన్ని గుర్తించి యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు వీసీకి, సీపీ కృతజ్ఞతలు తెలిపారు.


