కలం, వెబ్ డెస్క్: సంక్రాంతి (Sankranti) పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పబోతోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే మూడు, నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను పూర్తిగా నిలిపివేసి(Toll Free Travel), వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఉన్న పంతంగి, కొర్లపహాడ్ వంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతుంటాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ, భారీ రద్దీ కారణంగా ఒక్కో టోల్ దాటడానికి గంటల సమయం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం, రద్దీ రోజుల్లో టోల్ గేట్లను ఎత్తివేయాలని యోచిస్తోంది.
జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను నిలిపివేసే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి, అలాగే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు లేఖ రాయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. టోల్ వసూళ్ల వల్ల కలిగే జాప్యం కారణంగా హైవేలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఆ మూడు నాలుగు రోజులు మినహాయింపు(Toll Free Travel) ఇవ్వాలని కోరనుంది. అవసరమైతే ఆ టోల్ చార్జీలను ప్రభుత్వమే భరించే దిశగా కూడా ఆలోచన చేస్తోంది.
ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం గనుక రాష్ట్ర విన్నపానికి సానుకూలంగా స్పందిస్తే, ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణం సామాన్యులకు ఎంతో హాయిగా సాగనుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఇంధనం కూడా ఆదా అవుతుంది.
Read Also: ‘గిఫ్ట్ సిటీ’లో ఇండియన్ ఏఐ రీసెర్చ్ .. దేశంలోనే ఫస్ట్ సెంటర్‌గా ఏర్పాటు
Follow Us On: Youtube


