కలం, నల్లగొండ బ్యూరో: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (Hyderabad Vijayawada Highway) వాహనాలతో కిక్కిరిసింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ వాసులు పల్లె బాట పట్టడంతో హైవే ఫుల్ ప్యాక్ అయిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు సులభంగా వెళ్లేందుకు అధికారులు విజయవాడ వైపు 11 టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల కోసం 5 టోల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. శనివారం మధ్యాహ్నం వరకు వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కానీ తర్వాత అధికారులు మూడు సెకండ్లకు ఒక వెహికల్ మూవ్ అయ్యే విధంగా టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేయడంతో కొంతమేర ట్రాఫిక్ జామ్ తగ్గిందని చెప్పాలి.
ఒక్కరోజులో లక్ష వాహనాలు
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి (Hyderabad Vijayawada Highway) పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా నుంచి గత 24 గంటల్లో గంటకు 27 వందల వాహనాల చొప్పున లక్ష వాహనాలు ప్రయాణించినట్లు అధికారిక అంచనా. సాధారణ రోజుల్లో 40 వేల వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, సంక్రాంతి పండుగ నేపథ్యంలో అది రెండు రెట్లు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద సూర్యాపేట, ఖమ్మం మీదుగా దారి మళ్లించారు. అయితే ఒక్కో వెహికల్ టోల్ ప్లాజాను దాటేందుకు అరగంటకు పైగా సమయం పడుతుండడం గమనార్హం. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఈరోజు మరింతగా వాహనాల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.
Read Also: కోడి పందేలపై ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp


