కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై వేదికగా మరోసారి సంజూ సామ్‌సన్ (Sanju Samson) బలహీనత బయటపడింది. సహజ ప్రతిభతో పెద్ద షాట్లు ఆడగలిగే బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, చెపాక్ మైదానం మాత్రం అతనికి పెద్ద సవాల్‌గా మారింది. తాజా సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్న అతనికి ఈ వేదికపై రికార్డు నిరాశ కలిగిస్తోంది. సంజూ సామ్‌సన్ గతంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో అతని ప్రదర్శన మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇప్పటివరకు ఈ వేదికపై ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌లలో అతను ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 11 మాత్రమే ఉండగా, స్ట్రైక్ రేట్ 100గా నమోదైంది.
ఈ గణాంకాలు అతని స్థాయికి చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఐపీఎల్‌లో కనీసం ఐదు ఇన్నింగ్స్ ఆడిన వేదికల్లో ఇది అతని అత్యల్ప సగటుగా నిలిచింది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా కెరీర్ స్థాయికి చాలా దూరంగా ఉంది. అంటే అతను త్వరగా ఔట్ కావడం మాత్రమే కాకుండా, క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా పరుగులు చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. చెపాక్ పిచ్ స్వభావం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ మైదానంలో స్పిన్నర్లకు ఎక్కువ సహకారం ఉంటుంది. బంతి వేగం తక్కువగా ఉండటంతో బ్యాట్స్‌మన్ స్వయంగా పవర్‌ను సృష్టించుకోవాల్సి వస్తుంది. దీంతో టైమింగ్ తప్పిపోవడం, తప్పిద షాట్లు ఆడడం జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ఇంకా కీలక మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ పరిస్థితిలో చెపాక్‌లో తన బలహీనతను అధిగమించడం సంజూ సామ్‌సన్‌కు అవసరంగా మారింది. సీఎస్‌కే కూడా అతని నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. జట్టు విజయాలకు అతని పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది.

