కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున మెరుపులు మెరిపిస్తున్న సంజూ శాంసన్ (Sanju Samson), త్వరలోనే ఆ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) జోస్యం చెప్పారు. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నైకి మారిన సంజూ, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో కలిపి 185 పరుగులు చేశారు. ఆయన స్ట్రైక్ రేట్ 172.89గా ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో సంజూ నాయకత్వ పటిమపై అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ఏదో ఒక సమయంలో శాంసన్ ఖచ్చితంగా సీఎస్‌కే కెప్టెన్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే సంజూ ఎవరి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం లేదని, తనదైన శైలిలో జట్టును నడిపిస్తూ సొంత ముద్ర వేయాలని అశ్విన్ సూచించారు. గతంలో 2021 నుండి 2025 వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూకు మంచి అనుభవం ఉంది. ఆయన సారథ్యంలో రాజస్థాన్ ఆడిన 67 మ్యాచ్‌లలో 33 గెలిచి, 32 ఓడిపోయింది. అశ్విన్ కూడా రాజస్థాన్ జట్టులో సంజూ కెప్టెన్సీ కింద మూడేళ్ల పాటు ఆడారు.
శాంసన్ నాయకత్వ లక్షణాల గురించి వివరిస్తూ.. ఆయన ఫీడ్‌బ్యాక్‌ను స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అశ్విన్ (Ravichandran Ashwin) కొనియాడారు. ఆటగాళ్లతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవుతూ, మానవీయ కోణంలో సంభాషించడం ఆయన ప్రత్యేకతని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండటం వల్లే సంజూ మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని వెల్లడించారు. ఇటీవలే భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ శాంసన్, ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 182 మ్యాచ్‌ల్లో 4,889 పరుగులు చేశారు. భవిష్యత్తులో చెన్నై జట్టులో ఆయన పోషించబోయే పాత్రపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: విపక్షాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ
Follow Us On : WhatsApp

