కలం, నేషనల్ బ్యూరో: భారత్‌లో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో మరింత భద్రత, ఎక్కువ మన్నిక కలిగిన పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల (Polymer Currency Notes) ముద్రణకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగు వేసింది. ప్రయోగాత్మకంగా సుమారు మూడున్నర కోట్ల పాలిమర్ నోట్ల ముద్రణ కోసం అవసరమైన ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ సరఫరాకు భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పాలిమర్ కరెన్సీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఈ టెండర్‌లో జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఆర్బీఐ ముద్రణ సంస్థ పలు కఠిన నిబంధనలు విధించింది. ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ దేశాలకు చెందిన ముడి పదార్థాలను వినియోగించరాదని స్పష్టం చేసింది. టెండర్‌లో పాల్గొనే సంస్థలు ఆ దేశాలతో తమకు ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రత్యేక డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే సరఫరా చేసే పాలిమర్‌లో జంతువుల కొవ్వు లేదా డీఎన్ఏ ఆనవాళ్లు లేవని ధృవీకరణ పత్రం సమర్పించడం కూడా తప్పనిసరి చేసింది.
గత నెలలోనే సూత్రప్రాయ నిర్ణయం
పాలిమర్ నోట్ల ముద్రణ అంశంపై గత నెలలో జరిగిన రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఆ సమయంలో ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉందని ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) వెల్లడించారు. అన్ని అనుకూల, ప్రతికూల అంశాలను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలోనే గ్లోబల్ టెండర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పాలిమర్ కరెన్సీపై ఆర్బీఐ ముందడుగు వేసినట్లు స్పష్టమైంది. ఈ టెండర్‌లో పాల్గొనే సంస్థలు గతంలో ఇతర దేశాల కేంద్ర బ్యాంకులకు పాలిమర్ కరెన్సీ సబ్‌స్ట్రేట్ సరఫరా చేసిన అనుభవం వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. భద్రతా ప్రమాణాల విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.
68 వేల రీమ్‌ల పాలిమర్ సబ్‌స్ట్రేట్ అవసరం
టెండర్ ప్రకారం సుమారు 68 వేల రీమ్‌ల బయాక్సియల్లీ ఓరియెంటెడ్ పాలీప్రొపిలీన్ (BOPP) పాలిమర్ సబ్‌స్ట్రేట్ అవసరమని BRBNMPL పేర్కొంది. ఒక్కో రీమ్‌లో 500 ప్రత్యేక షీట్లు ఉంటాయి. వీటిపైనే భారతీయ కరెన్సీ నోట్లు ముద్రించనున్నారు. ప్రతీ నోటు 70 మిల్లీమీటర్ల వెడల్పు, 150 మిల్లీమీటర్ల పొడవు ఉండేలా రూపకల్పన చేయనున్నారు. ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే భవిష్యత్తులో వివిధ విలువల కరెన్సీ నోట్ల కోసం మరింత పెద్ద మొత్తంలో పాలిమర్ సబ్‌స్ట్రేట్ కొనుగోలు చేసే అవకాశముందని టెండర్‌లో పేర్కొన్నారు.
అత్యాధునిక భద్రతా ఫీచర్లు
పాలిమర్ నోట్లలో నకిలీలను అడ్డుకునేందుకు అత్యాధునిక భద్రతా సాంకేతికతను వినియోగించనున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం నోట్లలో పారదర్శక విండో, మెటాలిక్ న్యూమరల్, మాగ్నెటిక్ సూడో థ్రెడ్, షాడో ఇమేజ్, ఐరిడిసెంట్ ప్యాటర్న్ వంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లు ఉండాలి. అవసరమైతే తయారీ సంస్థల సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించే హక్కును కూడా BRBNMPL తన వద్ద ఉంచుకుంది.
పేపర్ నోట్లతో పోలిస్తే ఎక్కువ మన్నిక
ఆర్బీఐ (RBI) వార్షిక నివేదిక ప్రకారం BRBNMPL, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ కలిసి గత ఏడాది 2,810 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించగా, ఇందుకోసం దాదాపు రూ.4,800 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో 1,700 కోట్ల నోట్లు చెలామణికి పనికిరాకుండా పోయాయి. పాలిమర్ నోట్లు పేపర్ నోట్ల కంటే ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో ముద్రణ వ్యయం కూడా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
చైనా, పాకిస్థాన్‌పై కఠిన షరతులు
జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ టెండర్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఇండియన్ కరెన్సీ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు చైనా లేదా పాకిస్థాన్ నుంచి రావద్దని స్పష్టం చేశారు. ఆ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా అదనపు భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశాలతో తమ వ్యాపార సంబంధాలను వెల్లడిస్తూ ప్రత్యేక డిక్లరేషన్ సమర్పించడం తప్పనిసరి చేశారు. పాలిమర్ సబ్‌స్ట్రేట్‌లో జంతువుల కొవ్వు, డీఎన్ఏ వంటి జీవ పదార్థాలు లేకుండా ఉండాలని స్పష్టమైన నిబంధన విధించారు. దీనికి సంబంధించిన ప్రయోగ నమూనాలు, ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
టెండర్ నిబంధనల ప్రకారం ఆగస్టు 18 వరకు ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హత సాధించిన సంస్థలను ఎంపిక చేసి ప్రయోగాత్మక సరఫరా బాధ్యతలను అప్పగిస్తారు. నమూనాలు ఫీల్డ్ ట్రయల్స్‌లో విజయవంతమై, ప్రభుత్వం నుంచి అవసరమైన భద్రతా అనుమతులు లభించిన తర్వాతే తుది ఒప్పందాలు కుదురనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే భారతీయ కరెన్సీ ముద్రణలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో దేశంలోని వివిధ డినామినేషన్ల నోట్లు కూడా పాలిమర్‌పై ముద్రించే అవకాశాలు మరింత బలపడనున్నాయి.
పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు కింద ఉన్న కలం 360 డిగ్రీస్ పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి

Read Also: బీజేపీలో బిగ్ ట్విస్ట్: ఆ నేతల మధ్య సయోధ్య చర్చలు!
Follow Us On : WhatsApp

