కలం, వెబ్ డెస్క్ : ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బంపరాఫర్. తొలిసారిగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సెకండియర్ లోనూ ‘ఇంప్రూవ్‌మెంట్’కు అవకాశం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి (Intermediate Board) ప్రకటించింది. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేసింది.
మేలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఈ పరీక్షల ఫీజు చెల్లింపులు ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 వరకు స్వీకరించబడతాయని పేర్కొంది. ఈ సారి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్ మెంట్ కు అవకాశం ఇచ్చామని.. సబ్జెక్టుల వారీగా బెస్ట్ మార్క్స్ విధానం అవుతుందని స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి, సెకండియర్ లో ఫెయిలైనా, ఇంప్రూవ్ మెంట్ కైనా పరీక్షలు రాయొచ్చని స్పష్టం చేసింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

