ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూములపై కాంగ్రెస్ ఫోకస్.. కలెక్టర్‌కు కీలక వినతి!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎ.సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) జిల్లా కలెక్టర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. ఆల్ మేవా అసోసియేషన్ ఆఫ్ మహబూబ్‌నగర్ వ్యవస్థాపక చైర్మన్ షేక్ ఫారూక్ హుస్సేన్ తన దృష్టికి వచ్చిన అంశాలను జిల్లా పరిపాలన దృష్టికి తీసుకెళ్లినట్లు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు.

రామచంద్రాపురం గ్రామంలోని ముస్లిం శ్మశాన వాటిక సుమారు 1 ఎకరం 10 గుంటల విస్తీర్ణంలో ఉన్నట్లు పేర్కొంటూ, అక్కడ నిర్మాణాలు లేదా ఆక్రమణలు జరిగాయా అనే విషయంపై తక్షణ సర్వే నిర్వహించి, రెవెన్యూ రికార్డులను పరిశీలించి హద్దులను నిర్ధారించాలని కోరారు. అలాగే శ్మశాన వాటికకు శాశ్వత రక్షణ కల్పించేలా ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అమిస్తాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 4లో సుమారు 12 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమి ఉన్నట్లు పేర్కొంటూ, భూమి రికార్డులను పరిశీలించి, ఆక్రమణలు, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అనధికారిక నిర్మాణాలు, ఆక్రమణలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తిని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని బాగ్మార్ సాహెబ్ దర్గా సమీపంలోని సర్వే నంబర్ 812లో ఉన్నట్లు పేర్కొంటున్న ముస్లిం శ్మశాన వాటిక విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలానికి సంబంధించిన ఖచ్చితమైన విస్తీర్ణం, భూమి హోదా, రెవెన్యూ, వక్ఫ్ రికార్డులను అధికారికంగా పరిశీలించి నిర్ధారించాలని ఆయన కోరారు.

ప్రజల విశ్వాసాలకు సంబంధించిన శ్మశాన వాటికలు, వక్ఫ్ ఆస్తుల విషయంలో అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన, చట్టబద్ధమైన రక్షణ చర్యలు చేపట్టడం అవసరమని సంజీవ్ ముదిరాజ్ పేర్కొన్నారు. శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణ కేవలం ఆస్తుల రక్షణ మాత్రమే కాకుండా ప్రజల మనోభావాలు, సామాజిక సామరస్యం, మృతుల గౌరవాన్ని కాపాడే బాధ్యతగా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ కమిటీ సభ్యులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, రాములు యాదవ్, ఎంఏ కలీమ్, మజార్ ఖాన్, బ్రహ్మయ్య, కార్పొరేటర్ ఎంపీ ప్రవీణ్ కుమార్, నాయకులు బురెమోని చందు యాదవ్, నియాజ్ తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>