కలం, రాజన్న సిరిసిల్ల: ముదిరాజ్ సమాజ హక్కుల సాధన, బీసీ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా గొంతు విప్పాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన “ముదిరాజ్ సింహగర్జన” (Mudiraj Simha Garjana) బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసన మండలి చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ, ముదిరాజ్ కులాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ..విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి బీసీల సమస్యలపై పోరాడుతున్నానని, దాదాపు మూడు దశాబ్దాలుగా బీసీ ఉద్యమాలతో తనకు అనుబంధం ఉందని మంత్రి తెలిపారు.
మన బలం ఐక్యతలోనే ఉందన్న ఆయన, శాసనసభ, పార్లమెంట్లలో మన హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. శ్రీహరి , బండా ప్రకాశ్ మార్గదర్శకత్వంలో ముదిరాజ్ , బీసీల సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ జనగణనలో కులగణన చేరుస్తామని చెప్పి బీసీలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగణనకు మద్దతు ఇచ్చిందని, దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలని డిమాండ్ చేశారు. “జిత్నీ ఆబాది ఉత్నే ఇసేదారి” (జనాభా ప్రకారం భాగస్వామ్యం) సూత్రం ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రతి కులానికి ప్రాతినిధ్యం, సంక్షేమ ఫలాలు దక్కాలన్నారు.
నేతన్నలు, గీత కార్మికులకు ఇస్తున్న తరహాలోనే యాదవులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, ముదిరాజులు తదితర ఇతర వృత్తి కులాల వారికి కూడా 50 ఏళ్లకే పెన్షన్ అందించే అంశంపై కార్యాచరణ రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు, ముదిరాజ్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి, చదువు, పోటీ పరీక్షల శిక్షణ ఇచ్చే మార్గదర్శక కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు. బీసీ కులాల మధ్య విభేదాలు లేకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, సంప్రదాయ వృత్తుల పరిరక్షణతో పాటు ఆయా కుటుంబాలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.

